Thursday, November 15, 2018

వాల్మీకి రామాయణం - యధాతధం - సేతు నిర్మాణం

యుద్ధ కాండ - ఇరువదిరెండవ సర్గ

శ్రీ రాముడు సముద్రుని పై  బ్రహ్మాస్త్రం ప్రయోగించటానికి ఎక్కు పెట్టగానే , సముద్రుడు ప్రాంజలియై, తన స్వభావాన్ని ఇట్లు వివరించెను:-

"సవ్యుదమైన ఓ రఘువీరా! భూమి, ఆకాశం, జలము, అగ్ని అను పంచభూతములు శాశ్వతమైన పద్ధతులను అనుసరించి తమ తమ స్వభావముల మేరకు ప్రవర్తిన్చును.  అట్లాగే లోతుగా ఉండుట, దాటుటకు శక్యము కాని రీతిగా ఉండుట నా స్వభావము. ధనాపేక్షతో కానీ, లోభాగుణము వలన కానీ, దండ భయమువల కానీ, ఏ విధముగా నైనా ఈ జలములను స్తంభిమ్పచేయలేను. రామా, నీవు వెళ్ళుటకు దారి ఏర్పరిచి, అనువుగా సహించెదను, నీ సైన్యములు సముద్రము దాటి వేల్లువరకు జలజంతువులు వాటిని బాధింపకుండా ఉండునట్లు చూసేద.

వానర యోధులలో ప్రముఖుడు నలుడు విశ్వకర్మ కుమారుడు. అతనికి తండ్రి నుండి వర ప్రభావముచే శిల్పకళా నిపుణత వచ్చెను. అతను నా పై సేతువును నిర్మించగలడు. నేను దానిని భరిం పగలను ".

అంతట శ్రీరాముడు వానర నాయకులకు వంతెన నిర్మించటానికి ఆజ్ఞ ఇచ్చెను.

లక్షల కొలది వానరులు మహారణ్యం లో ప్రవేశించి, పెద్ద పెద్ద చెట్లను, కొండశిలలను ముక్కలు ముక్కలు చేసి యంత్రముల మీద సముద్ర తీరానికి చేరవేశారు. 

నలుడు సముద్ర మధ్యమున సేతువు నిర్మాణ కార్యక్రమానికి నాంది పలికెను. అందరు వానరులు ఆయనకు సహకరించుట మొదలు పెట్టారు. కొందరు కొలతబద్దలు పట్టుకున్నారు, కొందరు నిర్మాణం పై కొండ శిలలను రేర్చారు. కొందరు కర్రలను పేర్చి త్రునములతో కట్టివేస్తే ఇంకొందరు గిరి శిఖరాలను మోసుకు వచ్చి సముద్రంలో విసిరివేశారు.

మొదటి నాడు - పదునాలుగు యోజనముల సేతువు నిర్మిమ్పబడెను. రెండవనాడు, ఇరువది యోజనముల దూరము, మూడవనాడు, ఇరువదియొక్క యోజనములు, నాల్గావనాడు ఇరువదిరెండు యోజనములు, మరియు ఐదవనాడు ఇరువదిమూడు యోజనాల సేతువు నిర్మించి లంకా ద్వీపమున వున్న సువేల పర్వతం చేరిరి.

నలుడు సిద్ధపరచిన ఆ సేతువు నిర్మించుట ఇతరులకు దుష్కరము. అది పడి యోజనముల వెడల్పు, వంద యోజనముల దూరము కలిగి వున్నది. అది సముద్రమునకు పాపట వాలే శోభిల్లెను. ఆ అద్భుత నిర్మాణమును దేవతలు, గంధర్వాదులు రెప్పలార్పక కుతూహలముతో దర్శించిరి.